అచ్చం ఐసిస్‌ తరహాలో క్రూరంగా.. రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్‌

29 Jun, 2022 07:31 IST|Sakshi

జైపూర్‌: మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన ఓ టైలర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్‌ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్‌ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 

బీజేపీ సస్పెండ్‌ నేత నూపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్‌ గొంతు కోయగా.. గౌస్‌ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్‌ సహా పోలీస్‌ శాఖ నిందితుల వీడియోలను వైరల్‌ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు.

ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్‌పూర్‌తో పాటు రాజస్తాన్‌ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్‌ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్‌ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్‌ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్‌ఐఏ బృందాన్ని పంపింది. 

కస్టమర్లలా వచ్చి... 
మృతుడు కన్హయ్యా లాల్‌ ఉదయ్‌పూర్‌లో టైలర్‌. హంతకులు రియాజ్‌ అక్తరీ, మహ్మద్‌ గౌస్‌ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్‌ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్‌ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్‌ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్‌ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. 

నూపుర్‌ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్‌ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్‌ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్‌ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్‌ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్‌పూర్‌ ఎస్పీ మనోజ్‌కుమార్‌ చెప్పారు. 

రక్షణ కోరినా పట్టించుకోలేదు..
మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సతీశ్‌ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌కుమార్‌ అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్త: షాకింగ్‌ ఘటన.. అందరూ చూస్తుండగానే..

మరిన్ని వార్తలు