ఉదయ్‌పూర్‌ హత్య కేసు.. 2611 బైక్‌ నంబర్‌ కోసం ఎక్స్‌ట్రా డబ్బులుచ్చి..

1 Jul, 2022 21:07 IST|Sakshi

జైపూర్‌: రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జరిగిన హిందూ టైల‌ర్ క‌న్హ‌యలాల్ హ‌త్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హంతకులు వినియోగించిన బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ప్రస్తుతం సంచలనంగా మారింది. హంతకుల్లో ఒకరైన రియాజ్‌ అక్తారీ RJ27AS 2611 అనే బైక్‌ నంబర్‌ కోసం రూ. 5,000 అదనంగా చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల బైక్‌ నెంబర్‌, 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్ర దాడి తేదీ (26/11)తో సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. క‌న్హ‌య్య‌లాల్‌ను చంపిన తరువాత నిందితులు ఇదే బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించినట్లు  పోలీసులు పేర్కొన్నారు.

కాగా బీజేపీ నేత నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపిన టైల‌ర్ క‌న్హ‌య్య‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు కత్తితో పొడిచిన విష‌యం తెలిసిందే. ఈ కేసులోని ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహ‌మ్మ‌ద్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ విచారిస్తోంది. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ దావ‌త్ ఎ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధం ఉన్న‌ట్లు రాజస్థాన్‌ పోలీసులు అనిమానిస్తున్నారు. ఇద్ద‌రు నిందితుల‌ను గురువారం కోర్టుముందు హాజ‌రుప‌రిచారు. వారికి కోర్టు 14 రోజుల పాటు జుడిషియ‌ల్ కస్ట‌డీ విధించింది.
చదవండి: నూపుర్‌ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌.. కాంగ్రెస్‌ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’

మరిన్ని వార్తలు