ముంబై.. క్షణ క్షణం ఉద్రిక్తం.. మహా మోర్చా Vs మాఫీ మాంగో మోర్చా

17 Dec, 2022 16:35 IST|Sakshi

సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతి బా పూలే, డా.బీఆర్‌ అంబేడ్కర్‌లపై గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఓవైపు మహావికాస అఘాడీ మహా మోర్చా పేరుతో శనివారం ఆందోళనకు దిగింది. ఎమ్‌వీఏ మహా మోర్చాలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చేరారు. నిరసన ర్యాలీ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ సావిత్రీబాయి ఫూలే, ఇతర గొప్ప వ్యక్తులపై ఏలాంటి కామెంట్స్‌ చేసినా మహారాష్ట్ర ప్రజలు సహించరని ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. రాష్ట్ర చరిత్రను మార్చేందుకు ప్రయత్నించరాదని షిండే ప్రభుత్వాన్ని హెచ్చరించారు,.

మరోవైపు మాఫీ మాంగో మోర్చా పేరుతో బీజేపీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముంబై అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓ వైపు విపక్షం మరోవైపు ప్రభుత్వంలోని ఓ పార్టీ ఆందోళనలకు దిగడంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆందోళన, ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ముంబైలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

ఎందుకు మహామోర్చా?
మహా వికాస్‌ ఆఘాడి ఈ నెల 17వ తేదీ శనివారం ముంబైలో నిర్వహించనున్న మహా మోర్చాకు ముంబై పోలీసులు అనుమతి ఇచ్చినట్టు శివసేన ఠాక్రే వర్గం నేత అనీల్‌ పరబ్‌ మీడియాకు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబాసాహెబ్‌ అంబేడ్కర్, మహాత్మ పూలేలపై బీజేపీ నేతలు, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు నిరసనగా మహావికాస్‌ ఆఘాడి ఆధ్వర్యంలో ఈ మహామోర్చా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శిందే, ఫడ్నవీస్‌ ప్రభుత్వం కూడా వారు చేసిన వ్యాఖ్యలను సమరి్ధస్తోందని ఈ సందర్భంగా మహావికాస్‌ ఆఘాడి నేతలు ఆరోపించారు. అదేవిధంగా రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై శిందే సర్కారు నోరు మెదపడం లేదు. ఇలా అనేక అంశాలను ఖండిస్తూ ముంబైలో మహామోర్చాను తలపెట్టింది.

మాఫీ మాంగో మోర్చా... 
మహావికాస్‌ ఆఘాడి నిర్వహించే మహామోర్చాకు దీటుగా బీజేపీ శనివారం మాఫీ మాంగో మోర్చా నిర్వహించనుందని బీజేపీ నేత ఆశీష్‌ శేలార్‌ మీడియాకు తెలిపారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చరిత్ర తెలియకుండా ఆయన జన్మస్థలంపై ఎంవీఏ నేతలు వివాస్పద వ్యాఖ్యలు చేస్తారని, మరోవైపు శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నేత సుష్మా అంథారే తమ దైవాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలపై సంజయ్‌ రావత్‌ క్షమాపణ చెప్పాలని ఆశీష్‌ శెలార్‌ డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఉద్దవ్‌ ఠాక్రే కూడా దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నాని కోరారు.  

పోలీసు బందోబస్తు... 
మహావికాస్‌ ఆఘాడి, బీజేపీల మహా మోర్చా, మాఫీ మాంగో మోర్చాల నేపథ్యంలో ముంబైలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా సుమారు రెండున్నవేలకు పైగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా దీనికి సంబంధించిన బాధ్యతలు ఇద్దరు అడిషనల్‌ కమిషనర్‌లు, నాలుగు నుంచి అయిదుగురు డిప్యూటి పోలీసు కమిషనర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఆందోళన సందర్భంగా ఎస్‌ఆర్‌పీఏ బలగాలతోపాటు డ్రోన్‌కెమెరాలతో పరిసరాలపై దృష్టి కేంద్రీకరించారు.   

మరిన్ని వార్తలు