Maharashtra Political Crisis: ప్రమాదంలో ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం.. అసెంబ్లీలో ఎవరి బలమెంత?

21 Jun, 2022 19:11 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రమంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే 21 మంది అనుచర ఎమ్మెల్యేలతో(మొత్తం 22 మంది) అజ్ఞాతంలోకి వెళ్లడం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యే షిండే కారణంగా శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతంగుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో ఉన్నారు. క్యాంప్‌లో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు శివసేన ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. వీరిని కలిసేందుకు శివసేన నేతలు మిలింద్‌ నార్వేకర్‌, రవీంద్ర ఫటక్‌లను గుజరాత్‌ పోలీసులు అనుమతించారు. కాగా మంత్రితో సహా పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే శివసేన భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 33 మంది సేన ఎమ్మెల్యేలు హాజరైనట్లు ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు.
సంబంధిత వార్త: శివసేనకు మంత్రి గుడ్‌ బై?.. స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే 

ఎవరి బలమెంత?
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. వీటిలో శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించడంతో సంఖ్య 287కు తగ్గింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 144 ఎమ్మెల్యేల బలం కావాల్సి  ఉంది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

శివ‌సేన‌కు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి.  శివసేనకు  చెందిన 21 మంది ఎమ్మెల్యేలతోపాటు ఒక ఇండిపెండెంట్ సూరత్ హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే  అసెంబ్లీలో శివసేన సంఖ్య 34కి తగ్గనుంది.
చదవండి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవ‌రీ ఏక్‌నాథ్ షిండే?

మెజార్జీ మార్క్‌కు మించి బలం ఉంది: బీజేపీ
దీంతో సభలో మహా వికాస్ అఘాడి బలం 131కి తగ్గుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సభలో కొత్త మెజారిటీ మార్క్ 133 అవుతుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ మార్కు కంటే ఎక్కువగా తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా హోటల్‌లో బస చేస్తున్న  21 మంది శివసేన ఎమ్మెల్యేలు ఒకవేళ పార్టీ మారితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి పోటీచేసి గెలవాల్సి ఉంటుంది. 

నా వద్ద 35 మంది ఎమ్మెల్యేలు: ఏక్‌నాథ్‌ షిండే
శివసేన నాయకుడు మిలింద్ నార్వేకర్ మంగళవారం గుజరాత్‌లోని సూరత్‌లో ఏక్‌నాథ్ షిండేతోపాటు ఇతర తిరుగుబాటు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో మిలింద్ నర్వేకర్ ఏక్నాథ్ షిండేను సిఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడించినట్లు సమాచారం.  తన వద్ద 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తుకు సిద్ధమైతే పార్టీలో చీలిక ఉండదని ఏక్‌నాథ్ షిండే చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు