ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం లేదు: ఉద్ధవ్‌ ఠాక్రే

4 Dec, 2020 14:32 IST|Sakshi

ఏడాది పాలన పూర్తి చేసుకున్న మహా సర్కార్‌

ముంబైలో మహారాష్ట్ర వికాస్ అఘాడి వార్సికోత్సవాలు

ముంబై: మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ధృడమైనదని, తన సహచరుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయవలసిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ ప్రభుత్వం నవంబర్ 28న ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఠాక్రే మాట్లాడుతూ..“నేను నా మంత్రులందరినీ విశ్వసిస్తున్నాను, నా సహోద్యోగుల ఫోన్‌లపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ మంచిగా పని చేస్తున్నారు. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. మేము మంచిగా పని చేస్తున్నందున వారు మమ్మల్ని గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ప్రజల శ్రేయస్సు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు”అని ఠాక్రే అన్నారు. 

కేం‍ద్ర ప్రభుత్వం విఫలమైంది: శరద్‌ పవార్‌
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ రైతుల నిరసనకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ‘‘రైతు బిల్లుల ఆమోదంతో మన రైతులు ఎదుర్కొనే పరిణామాలను కెనడాకు చెందిన ప్రముఖ నాయకులు అర్థం చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు. బీజేపీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో సమస్యలను పెంచారు. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దుయ్యబట్టారు. (చదవండి: స్టీరింగ్‌ నా చేతిలోనే ఉంది..)

రెండు, మూడు నెలల్లో అధికారంలోకి : బీజేపీ
వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి రౌసాహెబ్ డాన్వే ఇటీవల విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ‌మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రావడానికి వెంపర్లాడటం లేదని, కానీ అసహజంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు.’’ అని అన్నారు. 

గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా 105 స్థానాలను గెలుచుకోగా, శివసేన 56, ఎన్‌సిపి 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ సహకారంతో 2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ 80 గంటలపాటు అధికారంలో ఉంది. 2019 నవంబర్ 23 తెల్లవారుజామున ముంబైలోని రాజ్ భవన్‌లో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, శివసేన నేతృత్వంలోని ఎంవీఏ నవంబర్ 28 న పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమం చేసిన పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే అధికారంలో కొనసాగిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు