సీరం ఘటన: ప్రమాదమా.. విధ్వంసమా..?

23 Jan, 2021 11:23 IST|Sakshi

సీరం అగ్ని ప్రమాద ఘటనపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే 

దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయ్‌ 

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు ఎలాంటి నష్టం జరగలేదు 

ఇతర వ్యాక్సిన్ల ఉత్పత్తికి కూడా ఆటంకం కలగలేదు.. 

ప్రమాద ఘటనతో ఆర్థికంగా నష్టపోయాం..: సీరమ్‌ సీఈవో 

రోటా వైరస్, బీసీజీ వ్యాక్సిన్ల తయారీపై తీవ్ర ప్రభావం పడిందన్న పూనావాలా

ముంబై:సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)లో అగ్నిప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభించాం. అది పూర్తయిన తర్వాత, ఇది ప్రమాదమా? లేదా విధ్వంసమా? అ ని మాకు తెలుస్తుంది. దర్యాప్తు పూర్తి చేయని వ్వండి. ఈ ఘటనపై ఇప్పుడు ఏమీ చెప్పలేం’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. గురువారం ఎస్‌ఐఐలో జరిగిన ప్రమాద ఘటనను తెలుసుకునేందుకు సీఎం ఉద్ధవ్‌ శుక్రవారం ఎస్‌ఐఐని సందర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలాతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘గత వారం టీకా డ్రైవ్‌ ప్రారంభమైనప్పుడు కరోనాపై విజయం సాధించగలమనే ఆశలు రేకెత్తాయి. అయితే టీకా తయారు చేస్తున్న కేంద్రంలో అగ్ని ప్రమాదం గురించి వార్తలు ఆందోళనకు గురిచేశాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరి కుటుం బ సభ్యుల బాధ్యత సీరం ఇన్‌స్టిట్యూటే తీసుకుం టుంది. ప్రభుత్వం తరఫున కూడా వీరికి సాయం అందజేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న కేంద్రానికి ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాదం జరిగిన రెండు అంతస్తుల్లో కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండు అంతస్తుల్లో వేరే టీకాలు తయా రు చేస్తున్నారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగదు’ అని ఉద్ధవ్‌ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తాను పోస్ట్‌ చేసిన ట్వీట్‌ గురించి పూనావాలాను అడిగినప్పడు.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. దీంతో ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేనందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్‌ చేశాను. కొంత సమయం తర్వాత ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మరణించిన కార్మికులందరూ కాంట్రాక్టర్‌ ఉద్యోగులని, దీంతో వారి వివరాలు ఎస్‌ఐఐ వద్ద లేకపోవడంతో తప్పిందం జరిగింది’ అని పేర్కొన్నారు. 
(చదవండి: టీకాపై అపోహలు తొలగిద్దాం)

రూ.1,000 కోట్ల నష్టం జరిగింది... 
సీరం ఇన్‌స్టిట్యూట్‌ గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు రూ.1,000 కోట్ల నష్టం జరిగిందని ఆ కంపెనీ సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తుల్లో భవిష్యత్తు అవసరాల కోసం ఫిల్లింగ్‌ లైన్, బల్క్‌ ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉందని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నష్టం భారీగానే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ నిల్వ చేయని భవనంలో ఈ సంఘటన జరిగింనందున తాము చాలా అదృష్టవంతులమన్నారు. రోటా వైరస్, బీసీజీ వ్యాక్సిన్ల తయారీ కోసం ఉద్దేశించిన భవనంలో ఈ ప్రమాదం జరిగిందని, దీంతో భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో ఆర్థికంగా నష్టపోయాం కానీ వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో ఆటంకం కలగదని పూనావాలా స్పష్టం చేశారు.  

మూడు ఏజెన్సీలతో విచారణ.. 
వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మూడు ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. పుణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (పీఎంసీ), పుణే మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎంఆర్‌డీఏ), మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎంఐడీసీ)లు సీరం ప్రమాద ఘటనపై కలిసి దర్యాప్తు చేయనున్నాయి. సెజ్‌–3 ప్రాంతంలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఐదంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరేగగా.. ఆ భవనంలోని రెండు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ భవనంలో మంటలు చెలరేగడానికి కారణమేంటో విచారించేందుకు పీఎంసీ, ఎంఐడీసీలతో కలిసి పీఎంఆర్‌డీఏ ఉమ్మడి దర్యాప్తు చేపట్టనున్నట్లు పీఎంఆర్‌డీఏ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దేవేంద్ర పాట్ఫడే తెలిపారు. 
(చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్‌!)

ప్రమాదంలో భవనంలోని 4, 5వ అంతస్తులు పూర్తిగా పాడయ్యాయని పేర్కొన్నారు. పలు రకాల పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయన్నారు. దర్యాప్తు తర్వాత అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేది తెలుస్తుందన్నారు. అయితే కారణాలేమై ఉంటాయన్న దానిపై మాత్రం స్పందించడానికి ఆయన నిరాకరించారు. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై ఇప్పుడే స్పందించలేమని ఎంఐడీసీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సంతోష్‌ వార్రిక్‌ పేర్కొన్నారు. సీరం అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించామని, అసలు ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకోవడమే తమ దర్యాప్తు ముఖ్యోద్దేశం అని పీఎంసీ ఫైర్‌ శాఖ అధిపతి ప్రశాంత్‌ రానిప్సే తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరిస్తున్నారని మరో అధికారి వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి హడాప్సర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ‘మంటలు చెలరేగడం, ప్రమాదవశాత్తు మృతి’ కేసు నమోదు చేశామని స్థానిక జోన్‌–5 డీసీపీ నమ్రతా పాటిల్‌ వెల్లడించారు.   

ఐదుగురు చనిపోవడం బాధాకరం..: ఐరాస 
ఐక్యరాజ్యసమితి: పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ పేర్కొన్నారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని సెక్రటరీ జనరల్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాద ఘటనపై యూఎన్‌ చీఫ్‌ స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.   
(చదవండి: అక్కడ వేసవి వరకూ లాక్‌డౌన్‌..)

ప్రమాదవశాత్తు జరిగింది..: పవార్‌
ముంబై: పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఇందులో పనిచేసే శాస్త్రవేత్తల సమగ్రత గురించి ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. గురువారం సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక విధ్వంసం ఆరోపణలు ఉన్నాయన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శుక్రవారం కొల్హాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగింది ఒక ప్రమాదం. ఈ ఘటనలో ఎలాంటి విధ్వంసం లేదు. దీని గురించి ఈ రోజు మాట్లాడటం మాకు సరైంది కాదు. అయితే సీరంలో పనిచేసే నిపుణులు, శాస్త్రవేత్తల సమగ్రత గురించి మాకు ఎలాంటి సందేహం లేదు’అని అన్నారు. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు సంకోచిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎస్‌ఐఐ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అని, నిపుణులు ఆ సంస్థ ఉత్పత్తుల వాడకాన్ని సమర్థించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు, అలాంటిది తాను దీనిపై ఏమి మాట్లాడాలని అని పవార్‌ అన్నారు.    
 

మరిన్ని వార్తలు