ఏడాది పాలనలో ఠాక్రే ప్రభుత్వం విఫలం: ఫడ్నవీస్‌

28 Nov, 2020 13:38 IST|Sakshi

ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే ఏడాది పాలన విఫలమైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. ఠాక్రే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌, జర్నలిస్ట్‌ అర్నాబ్‌ గోస్వామి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ​కేసుల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించారని కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయని. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఘాటుగా స్పందించిందని ఆయన గుర్తు చేశారు. 

‘మేము అర్నాబ్ గోస్వామి, కంగనా రనౌత్‌కు అనుకూలం కాదు. కానీ ప్రభుత్వం వారితో వ్యవహరించిన తీరు మాత్రం దారుణం. ఠాక్రే బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంత బెదిరించే ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఆయన మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుతున్నాయి’ అని ఫడ్నవిస్ విమర్శించారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలతో చేస్తుందని శుక్రవారం ప్రచురించిన శివసేన మౌత్ పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఠాక్రే తెలిపారు. "మీరు కుటుంబాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తే, మీకు కుటుంబాలు, పిల్లలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలి. మీ వైఖరిని ఎలా అణిచివేయాలో మాకు తెలుసు" అని ముఖ్యమంత్రి అన్నారు.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై వచ్చిన విబేధాల కారణంగా ఈ కూటమి విడిపోయింది. 56 సీట్లు గెలుచుకున్న శివసేన ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు