గోవాలో బ్రిటన్‌ హోం సెక్రటరీ తండ్రికి ఉ‍న్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం

10 Sep, 2022 16:33 IST|Sakshi

పనాజీ: బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్‌ హోం సెక్రటరీ బ్రేవర్మన్‌ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్‌కి గోవాలోని అ‍స్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్‌ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్‌ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(సిట్‌) అధికారి నిధి వాసన్‌ తెలిపారు.

ఫెర్నాండజ్‌ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్‌ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్‌లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్‌లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్‌ ద్వారా  ఫెర్నాండజ్‌ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌ జస్పాల్‌ సింగ్‌ గోవా ఎన్నారై కమిషనరేట్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్‌ నరేంద్ర సవైకర్‌ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్‌ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్కెవ్స్‌, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది.

(చదవండి: గేమింగ్‌ యాప్‌ స్కామ్‌.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం)

మరిన్ని వార్తలు