Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం

28 Feb, 2022 11:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం హై లెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఇప్పటికే ఆపరేషన్‌ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీలో.. కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. 


కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్‌ రిజ్జు, జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్‌ ఇందులో పాల్గొననున్నట్లు అధికార వర్గాల సమాచారం.  వీళ్లు హంగేరి, రొమేనియా, పోల్యాండ్‌, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను చేపట్టింది కేంద్రం.  మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ నుంచి పోల్యాండ్‌కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఉక్రెయిన్‌లో సుమారు పదిహేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు