బాబ్రీ మసీదు కూల్చివేత.. తీర్పు ఎలా ఉన్నా పర్లేదు

25 Jul, 2020 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి తనకు ఎలాంటి పట్టింపు లేదన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి. తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అంగీకరిస్తానని ఆమె తెలిపారు. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులలో ఉమా భారతి, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. ‘నా స్టేట్‌మెంట్‌ కోసం కోర్టు నన్ను పిలిచింది. నిజం ఏంటో కోర్టుకు వెల్లడించాను. ఇక తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి నాకు చింత లేదు. ఒక వేళ నన్ను ఉరి తీయాలనుకున్నా.. దాన్ని కూడా నేను ఆశీర్వాదంగానే భావిస్తాను. నా స్వస్థలంలో కూడా ఎంతో ఆనందిస్తారు’ అని తెలిపారు. (5 శతాబ్దాల సమస్య!)

ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ (92) శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకాగా.. మురళీ మనోహర్ జోషి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీబీఐ కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, దర్యాప్తును పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి.(బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు)

రామ మందిరం నిర్మాణం గురించి శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి స్పందించారు. ‘కరోనా, మందిర నిర్మాణం ఈ రెండు అంశాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరితో ఎలాంటి సంబధం లేని ట్రస్ట్‌ ఆలయ నిర్మాణం చేపడుతోంది. పవార్‌ వ్యాఖ్యలు వ్యతిరేక అర్థాన్ని సూచిస్తాయి. ఎలాంటి గొడవ జరగకుండా మందిర నిర్మాణం జరగడం వారికి నచ్చడం లేదు. ఆ ఆందోళనలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ జీ అయోధ్యలో ఉన్నప్పుడు పవార్‌ జీ.. ‘జై శ్రీరామ్‌.. జై రామ్’‌ అని పాడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు ఉమా భారతి.

మరిన్ని వార్తలు