Ukraine War: ఉక్రెయిన్‌లో తనయుడి వేదన.. టీవీ చూస్తూ ఆగిన తల్లి గుండె!

1 Mar, 2022 16:36 IST|Sakshi
శశికళ (ఫైల్‌)

సాక్షి, చెన్నై: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో తన కుమారుడు పడుతున్న కష్టాల్ని చూసిన వేలూరుకు చెందిన ఓ తల్లి గుండె ఆగింది. వీడియో కాల్‌ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసుకుని ఆ తనయుడు తీవ్ర వేదనలో మునిగిపోయాడు. వివరాలు.. ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడు లు అక్కడి ప్రజల్ని తీవ్ర కలవరంలోకి నెట్టింది. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని వలసలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తమిళ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

స్వదేశానికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగే కొద్ది ఆ విద్యార్థుల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆవేదన పెరి గింది. తమ పిల్లల్ని త్వరితగతిన భారత్‌కు తీసుకురావాలని సోమవారం కూడా పలు జిల్లాల కలెక్టర్లకు వారు విజ్ఞప్తి చేశారు. తిరుపత్తూరుకు చెందిన 11 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వీడియో కాల్‌ ద్వారా తమ కష్టాలను తెలియజేశారు.

ఆహారం, నీళ్లు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం మరో 23 మంది తమిళ విద్యార్థులు చెన్నైకు చేరడం కాస్త ఊరట కలిగించింది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసి ఆనందం వ్యక్తం చేసినా, ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులందరినీ తీసుకు రావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

చదవండి: (ఉక్రెయిన్‌ పెయిన్‌: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి)

తనయుడి కష్టం చూడలేక.. 
వేలూరు జిల్లా పెర్నాంబట్టు సమీపంలోని కొత్తూరు గ్రామ పరిధిలో ఉన్న పత్తూరు ప్రాంతానికి చెందిన శంకరన్‌ రైతు. ఆయనకు భార్య శశికళ(52), ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శక్తి వేల్‌ ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి శక్తి వేల్‌ పడుతున్న కష్టం, ఆవేదనను వీడియో కాల్‌ ద్వారా చూసిన తల్లి శశికళ తీవ్ర ఆందోళకు గురైంది.

అలాగే, టీవీలో వచ్చే ఉక్రెయిన్‌ సంబంధించిన వార్తలను చూస్తూ, తనకుమారుడ్ని తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి టీవీ చూస్తూ తీవ్ర ఉద్వేగానికిలోనై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లి కడచూపు కూడా శక్తివేల్‌ నోచుకోలేకపోతున్నాడు. వీడియో కాల్‌ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించినా, అతడ్ని ఓదార్చేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడం మరింత వేదన కలిగిస్తోంది.  

>
మరిన్ని వార్తలు