యువ రైతులకు దొరకని కన్యలు 

23 Nov, 2022 09:51 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రైతు అనే కారణంతో ఎక్కడా పెళ్లి చేసుకునేందుకు వధువు దొరకడం లేదని యువ రైతులు తహసీల్దార్‌ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసిన ఘటన ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా హొసళ్లి గ్రామంలో జరిగింది. రైతు దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతుకే పెళ్లి చేసుకోవడానికి కన్యలు దొరకని పరిస్థితి దాపురించిందని యువ రైతులు తహసీల్దార్‌ ఎదుట వాపోయారు.

రైతుల ఇంటిలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఎండకు వానకు శ్రమించాల్సి వస్తుందని, పైగా వ్యవసాయం జూదంలా మారిందని రైతులకు తమ ఆడపిల్లలను ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో యువ రైతులు ఆడపిల్లలు దొరక్క ఎంతో ఆవేదన చెందుతున్నారని వారు తహసీల్దార్‌ గ్రామ బస వేళ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రంపై ఇప్పడు అందరి దృష్టి మళ్లింది.

హొసళ్లి గ్రామంలో జరిగిన తహసీల్దార్‌ గ్రామ బస కార్యక్రమంలో యువ రైతులు దేశానికి అన్నం పెట్టడానికి రైతులు కావాలి, అలాంటి యువ రైతులకు కన్యను ఇవ్వడానికి జనం నిరాసక్తి చూపుతున్నారని, ఉద్యోగం ఉంటే పిల్లను ఇస్తామంటున్నారన్నారు. అలాంటప్పుడు రైతు పిల్లలు రైతులు కావాలా, వద్దా? అని నిలదీశారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి జనజాగృతి కార్యక్రమం చేపట్టాలని కుందగోళ తహసీల్దార్‌ అశోక్‌ శిగ్గాంవి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు.    

చదవండి: (Hyderabad-Constable: ఈశ్వర్‌ లీలలు ఎన్నెన్నో..!)

మరిన్ని వార్తలు