నిరుద్యోగిత తగ్గుతోంది

4 Apr, 2022 06:40 IST|Sakshi

కోల్‌కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీస్‌ మంత్లీ టైమ్‌ సీరిస్‌) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్‌2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్‌ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్‌లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్‌లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్‌ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు