పట్టణ, గ్రామీణ ఉపాధికి సెకండ్‌ వేవ్‌ షాక్‌!

26 Jul, 2021 15:51 IST|Sakshi

ఎగిసిన గ్రామీణ నిరుద్యోగం 

పట్టణ ఉపాధిలో స్వల్ప పెరుగుదల

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయం, లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉద్యోగ భారతాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో వారపు నిరుద్యోగిత రేటు  బాగా పెరిగింది.  సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు భారీగా ఎగిసింది. జూలై 25తో ముగిసిన వారంలో ఇది 6.75 శాతానికి పెరిగిందని తాజా డేటా వెల్లడించింది.  అంతకు ముందు వారం ఇది 5.1 శాతం ఉంది.

ప్రస్తుత జాతీయ నిరుద్యోగిత రేటు 7.14 శాతంగా ఉండగా, అంతకుముందు వారంలో ఇది 5.98 శాతంగా ఉంది అయితే గ్రామీణ పప్రాంతంతో పోలిస్తే  పట్టణ ఉపాధిలో స్వల్ప పెరుగుదల నమోదైంది.  జూలై 25 తో ముగిసిన వారంలో పట్టణ నిరుద్యోగం 8.01 శాతంగా నమోదైంది. అంతకుముందు వారం క్రితం 7.94 శాతంగా ఉంది. అయితే పట్టణాల్లో కోవిడ్‌ నిబంధనలను సడలించినప్పటికీ పట్టణ నిరుద్యోగిత రేటు గ్రామీణ, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. జూలై 25 తో ముగిసిన వారంలో మొత్తం నిరుద్యోగిత రేటు పెరిగినప్పటికీ,  కరోనా సెకండ్‌ వేవ్‌ తరువాత గత మూడు నెలలకంటే పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎంఐఈ పేర్కొంది.  

జూన్‌లో నెలవారీ జాతీయ నిరుద్యోగిత రేటు 9.17 శాతంగా ఉండగా, పట్టణ నిరుద్యోగం 10.07 శాతం, గ్రామీణ భారతదేశంలో 8.75 శాతంగా ఉంది. మెరుగైన వాతావరణానికి తోడు, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌  నియంత్ర‌ణ‌ల‌ను ఎత్తివేయ‌డంతో ఆర్థిక కార్య‌కలాపాలు ఊపందుకోవడం లాంటివి దీనికి సాయపడినట్టు తెలిపింది. క‌రోనా సెకండ్‌ వేవేవ్‌తో ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, క‌ఠిన ఆంక్షలు అమలు కావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో గ్రామీణ, పట్టణ ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. అయితే మే నెల‌లో 11.9 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌ 1 నాటికి  9.17 శాతానికి దిగి వచ్చింది.
 

మరిన్ని వార్తలు