Ramappa Temple: రామప్పకు విశ్వఖ్యాతి

26 Jul, 2021 18:25 IST|Sakshi

ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

తెలుగు నేలపై ఈ గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడం 

నాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు.. అద్భుత శిల్పాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం 

2015 నుంచీ ప్రయత్నాలు.. యునెస్కో సూచనల మేరకు మార్పులు 

తాజాగా వర్చువల్‌ భేటీ.. వారసత్వ హోదాపై సానుకూలంగా నిర్ణయం 

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో..
ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 
రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి.
యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది. 
యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. 
రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ న్యూఢిల్లీ:  వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. చైనాలోని వూహాన్‌ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. 

ఏళ్లుగా చేస్తున్న కృషితో.. 
రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్‌ (దరఖాస్తు) రూపొందకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో డోజియర్‌ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్‌ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మ్యాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌ (ఐకొమాస్‌)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్‌ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి.. మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. 

ఆక్రమణలను చూసి బిత్తరపోవడంతో.. 
నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులతో ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి బిత్తరపోయి, ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్‌ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్లీ సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్‌ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్‌ కాకతీయ టెంపుల్స్‌ అండ్‌ గేట్‌ వే’ పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)తోపాటు వరంగల్‌ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది.  

సౌకర్యాలు కల్పించాలి.. 
ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్‌ఐ పరిధిలో ఉంది. కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్‌ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తోంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణకు ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఇస్తోంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి. 

పీవీ అప్పుడే ఆకాంక్షించారు 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్‌ స్టోన్స్‌’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు. 

ఆ శిల్పాలు అద్భుతాలే..
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్‌ డోలరైట్‌ (నల్లశానపు) రాయిని వాడారు. 

సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. 
వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. 
నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం. 


ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. 
గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. 
భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. 

అద్దంలాంటి నునుపుతో.. 
ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. 
ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. 
దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి  చిత్రాలు ఉన్నాయి. 
ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి.  

రామప్పకు ఎలా వెళ్లాలి? 
వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. 
రైలు మార్గంలో అయితే వరంగల్‌ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. 
బస్సుల ద్వారా అయితే.. వరంగల్‌ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్‌ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు.

అభివృద్ధి పనులు షురూ.. 
రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం, రెండు స్వాగత తోరణాలు కట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. 

తరలిరానున్న పర్యాటకులు
రాష్ట్రంలో గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, కట్టడాలున్నా తగిన ప్రచారం, వసతులు లేక దేశ, విదేశీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలకు పోటెత్తుతున్నారు. తాజాగా రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏళ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది.  

దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నా.
– ప్రధాని మోదీ

కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 
– సీఎం కేసీఆర్‌

గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు 
13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది తెలంగాణ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు. దీనిపై తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా. 
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 
టీమ్‌ ఇండియాకు అభినందనలు 
భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యాలకు, శిల్ప కళా చాతుర్యానికి రామప్ప ఆలయం ఓ చక్కని ఉదాహరణ. టీమ్‌ ఇండియాకు అభినందనలు. 
– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా 
సంతోషకరమైన వార్త 
రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కడం గొప్ప వార్త. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.  
–కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 

ఎంతో ఆనందంగా ఉంది 
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించింది. దీనికి మార్గదర్శనం, మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి దేశం తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విదేశాంగ శాఖ, భారత పురావస్తు శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నా. 
– ట్విట్టర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

రామప్ప తర్వాతి లక్ష్యం హైదరాబాద్‌ నగరమే 
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని చేర్చడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు లభించడంలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. తెలంగాణ నుంచి రామప్ప తొలి వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించింది. తర్వాత హైదరాబాద్‌ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. 
–ట్విట్టర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 

చరిత్రలో చిరస్థాయిగా.. 
తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజిది. ఈ గుర్తింపుతో ‘రామప్ప’ కట్టడం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం సంతోషకరం. 
– శ్రీనివాస్‌గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి  
చాలా సంతోషం.. 
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన సీఎం కేసీఆర్‌ సహా అందరికీ  ధన్యవాదాలు. 
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ 
  
మా కృషి ఫలించింది 
రామప్పకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావటంతో ఆనందంగా ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిలో మా ట్రస్టు కీలకపాత్ర పోషించింది. పర్యాటకపరంగా రామప్ప ప్రాంత రూపురేఖలు మారతాయి. 
– పాపారావు, కాకతీయ హెరిటేజ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు