UNESCO Ramappa: కాకతీయులు... యూనెస్కో... రామప్ప..

10 Jul, 2021 11:00 IST|Sakshi

యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ పరిశీలనలో రామప్ప  

జులై 16 నుంచి యునెస్కో హెరిటేజ్‌ కమిటీ భేటీ 

ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొననున్న 21 సభ్య దేశాలు 

పోటీలో మొత్తం 255 కట్టడాలు, ప్రదేశాలు 

రామప్ప అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు  

వెబ్‌డెస్క్‌: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్‌ హెరిటేజ్‌ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో  బృందం జులై 16న సమావేశమవుతోంది. 

కాకతీయ వైభవం
వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్‌ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్‌ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి  వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

జులై 16న
ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్‌ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్‌ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్‌ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్‌లైన్‌లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది

బరిలో 255 కట్టడాలు
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్‌ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. 

శిల్పి పేరుతోనే
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. 

శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ
రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. 

నీటిపై తేలియాడే ఇటుకలు
ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. 

ఇంజనీరింగ్‌ విశేషాలు
ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్‌ గ్రానైట్‌లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. 

శిల్పకళ
ఆలయం నలువైపులా ఉ‍న్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. 

ఐదేళ్ల శ్రమ
రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌, ఇన్‌టాక్‌ వరంగల్‌ చాప్టర్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్‌ సైట్‌ టెంటిటీవ్‌ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్‌ (ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్‌) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్‌) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు.

ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 
యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్‌ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు.

చరిత్రకు సత్కారం
ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.   

మరిన్ని వార్తలు