29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

16 Jan, 2021 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారని గురువారం లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరుగుతాయి. స్టాండింగ్‌ కమిటీలు వివిధ శాఖలకు కేటాయించాల్సిన గ్రాంట్ల పరిశీలన, నివేదికలను సిద్ధం చేసేందుకు ఉభయ సభలు ఫిబ్రవరి 15వ తేదీన వాయిదాపడి తిరిగి మార్చి 8వ తేదీన సమావేశమవుతాయని తెలిపింది.

కోవిడ్‌–19 నిబంధనల దృష్ట్యా గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా షిఫ్టుల వారీగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యక్రమాలు జరుగుతాయి. లోక్‌సభ కార్యక్రమాలు రోజులో కనీసం ఐదు గంటలపాటు కొనసాగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్‌ తెలిపింది. ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. గత సమావేశాలు తక్కువ కాలం జరగడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసివేశారు. సభ్యులు ప్రైవేట్‌ బిల్లులను ఎప్పటిమాదిరిగానే శుక్రవారాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రవేశపెట్టేందుకు కూడా ఈ దఫా అవకాశం ఇస్తున్నారు.

చదవండి:
కరోనా వ్యాక్సినేషన్‌ తొలి టీకా.. వీడియో

ట్రాఫిక్‌ జామ్‌.. నెలకు రూ.2లక్షల ఆదాయం

మరిన్ని వార్తలు