సవాల్‌ మీద సవాల్‌.. ఆపై ఎలక్షన్స్‌.. పేద-మధ్యతరగతి, వేతన జీవుల ఆశలను పట్టించుకుంటారా?

1 Feb, 2023 08:36 IST|Sakshi

ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది.  కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. 

ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్‌ బడ్జెట్‌కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్‌ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది.  ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్‌లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. 

తరుముకొస్తున్న ఎన్నికలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్‌కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్‌ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది.  

పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

ద్రవ్యోల్బణ ప్రభావం
ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు.  

వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్‌ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి.

మరిన్ని వార్తలు