డిజిటల్‌ సీతారామం.. సూపర్‌ హిట్‌!

2 Feb, 2023 09:11 IST|Sakshi

‘ఈ జగమంతా రామమయం’
అన్నాడు ఆనాటి రామదాసు! 
ఈ నాటి నిర్మలా సీతారామమ్మ
బడ్జెట్‌ పాట కూడా ఇదే. కాకపోతే..
జగము స్థానంలో భారత్‌ అని.. రాముడికి బదులు డిజిటల్‌ అని మార్చుకోవాలి! 

కేంద్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం
మొదలుపెట్టిన డిజిటలీకరణకు
ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మంచి
మద్దతు లభించింది. దేశ పురోగతికి
కృత్రిమ మేధను వాడుకోవడం మొదలు..
రైతన్న సమస్యలన్నింటికీ ఒక్క చోటే
పరిష్కారాలు దక్కేలా చేయడం వరకూ
పలు ప్రతిష్టాత్మక డిజిటల్‌ కార్యక్రమాలకు
ఈ ఏడాది బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు.
ఒక్కొక్కటి వివరంగా చూద్దాం..

వ్యవసాయానికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌
ఈ ఏడాది బడ్జెట్‌లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్‌ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్‌పుట్స్‌ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా... పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్‌పుట్‌ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్‌ధన్‌ ఖాతాలు, డిజిటల్‌ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది.  

రైతులకు ఉపయోగపడే అనేక ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఐటీసీ ‘ఈ–చౌపాల్‌’ ‘దేహాత్‌’, ‘ఆర్య’, ‘రేష మండి’, ‘అనిమాల్‌.ఇన్‌’, ‘ఆక్వా–కనెక్ట్‌’’ వంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. కేంద్రం వీటిలోని మేలి అంశాల మేళవింపుగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందించవచ్చు. 

డిజిటల్‌ లైబ్రరీ
పుస్తకం హస్తభూషణమన్న పాత పాటకు పాతరేసి.. పుస్తకాలను ఇప్పుడు డిజిటల్‌ రూపంలో అందించేందుకు ప్రయత్నం మొదలైంది. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో, ప్రాంతాల్లో స్థాయిల్లోనూ యువతీ యువకులకు, బాలబాలికలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పుస్తకాలను ఈ డిజిటల్‌ లైబ్రరీ ద్వారా అందించనున్నారు. కోవిడ్‌ కారణంగా చదువుల్లో డిజిటల్‌ టెక్నాలజీ అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ లైబ్రరీ ఏర్పాటు కానుండటం విశేషం. స్మార్ట్‌ ఫోన్లు మొదలుకొని, డెస్‌్కటాప్‌ల వరకూ అన్నింటి ద్వారా ఈ లైబ్రరీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో  రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయి లో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటునూ ప్రోత్సహిస్తామని వాటిల్లోనే డిజిటల్‌ లైబ్రరీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘ఆర్థిక అంశాల్లో అక్షరాస్యత కల్పించేందుకు, పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ఈ ల్రైబరీలు ఉపయోగపడతాయి.’’అని సీతారామన్‌ తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమాలను కూడా స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ డిజిటల్‌ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తామన్నారు.  

దేశం కోసం.. దేశంలోనే..  కృత్రిమ మేధ
కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్‌ సిటీస్‌ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్‌కు చెందిన ‘ఇండియ రీసెర్చ్‌ ల్యాబ్‌ కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

5జీ కోసం వంద ల్యాబ్‌లు..
డిజిటల్‌ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్‌వర్క్‌తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వంద ల్యాబ్‌ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, ప్రిసిషన్‌ ఫారి్మంగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్‌ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు.  

టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్‌ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్‌ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్‌ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. 

నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం
రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్‌ అప్రెంటిస్షి‌ప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్‌లైన్‌ పద్ధతిలో స్టైఫండ్‌ అందించనున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్‌ డ్రోన్స్‌ ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది.   

స్కిల్‌ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్‌ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. 

నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ పాలసీ
ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్‌ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్‌ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్‌ కస్టమర్‌’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్‌ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్‌ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్‌ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్‌లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు.  

డిజిలాకర్‌లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్‌ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబరు (పాన్‌)లతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్‌ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది.  

డిజిటల్‌ కేటాయింపుల తగ్గింపు?  
ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4,785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్‌ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్‌ వంటివి) అందించడం ఈ డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే.. ప్రభుత్వ సేవలను డిజిటల్‌ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు.   

మౌలికం..  పెట్టుబడితో..
దేశ అభివృద్ధి వేగం పుంజుకునేలా భారీగా పెట్టుబడులు పెడతామని.. రోడ్లు, రైల్వే, విమాన, నౌకా రవాణా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడతామని నిర్మల తెలిపారు. బడ్జెట్‌లో మూలధన పెట్టుబడులకు కేటాయింపులను 10 లక్షల కోట్లకు (గతం కంటే 33% అదనం) పెంచుతున్నామని, ఇది దేశ జీడీపీలో 3.3% శాతానికి సమానమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు