బడ్జెట్‌ హల్వా వెనుక అంత కథ ఉందా?.. రాష్ట్రపతి భవన్‌ లీక్‌ వల్లే నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌కు..

26 Jan, 2023 20:57 IST|Sakshi

యూనియన్‌ బడ్జెట్‌ దరిమిలా.. మరో ముఖ్యమైన బడ్జెట్‌ హల్వా. బడ్జెట్‌ తయారీలో చివరి ఘట్టంగా  దీనిని పేర్కొంటారు. బడ్జెట్‌ తయారీలో పని చేసే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది కోసం హల్వా సిద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అయితే కాస్త గ్యాప్‌తో జరిగిన కార్యక్రమం కూడా ముగిసింది. 

ఏడాది గ్యాప్‌ తీసుకుని.. బడ్జెట్‌ హల్వా మళ్లీ మన ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కడాయిలో వండిన హల్వా సీల్‌ను తెరిచి.. అందరికీ పంచి ఈ ఆనవాయితీని కొనసాగించారు. గురువారం నార్త్‌ బ్లాక్‌లో జరిగింది ఈ కార్యక్రమం. సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి వారం, పదిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాకతాళీయంగా ఈసారి గణతంత్ర దినోత్సవం నాడే ఇది జరగడం గమనార్హం. కిందటి ఏడాది కరోనా కారణంగా హల్వాకు బదులకు స్వీట్లను పంచారు.

బడ్జెట్‌ హల్వా కార్యక్రమం.. ఆర్థిక మంత్రి సమక్షంలో జరుగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్‌ చౌదరి, భగవత్‌ కరాద్‌, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌, రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా.. ఇతరులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉంటే.. సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా ఐదవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గత రెండు బడ్జెట్‌లా మాదిరే ఈ ఏడాది కూడా పేపర్‌లెస్‌గా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారామె. 

హల్వా వేడుక.. అనేది బడ్జెట్‌లో ఓ ముఖ్యమైన ఘట్టం. బడ్జెట్‌ రూపొందించిన అధికారులకు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. తీపిని అందించడం ద్వారా ఈ వేడుకను ప్రతీ ఏటా నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కిందటి ఏడాది మాత్రం బదులుగా స్వీట్లు పంచారు.

బడ్జెట్‌ తయారీ అంతా ఫైనల్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్‌ బయటకు వచ్చేదాకా అంతా గోప్యంగానే ఉంటుంది. బడ్జెట్‌ రూపొందించే అధికారులు, సిబ్బంది అంతా వందమంది దాకా ‘లాక్‌ ఇన్‌ పీరియడ్‌’లో ఉండిపోతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా(కుటుంబ సభ్యులతో సహా) ఉండిపోతారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చేది. ఒక రకంగా చూసుకుంటే.. ఇది క్వారంటైన్‌ లాంటిదే!.

గతంలో లాక్‌ఇన్‌ పీరియడ్‌ రెండు వారాలు ఉండేది. తర్వాత పదిరోజులు అయ్యింది. ఇప్పుడు బడ్జెట్‌ అనేది డిజిటల్‌ ఫార్మట్‌కు మారడంతో.. ఐదు రోజులకు కుదించారు.

1950లో బడ్జెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించారు. అయితే ఆ సమయంలో బడ్జెట్‌ డాక్యుమెంట్లు లీక్‌ అయ్యాయి. దీంతో పెనుకలకలమే రేగింది. ఆపై ఢిల్లీ మింట్‌ రోడ్‌లోని ప్రింట్‌ ప్రెస్‌కు మారింది. ఆపై 1980 నుంచి నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లో బడ్జెట్‌ ప్రెస్‌ను ఇందుకోసం శాశ్వతంగా వినియోగిస్తున్నారు.   

నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో 1980-2020 మధ్య కాలంలో బడ్జెట్‌ ప్రతులను ముద్రించేవాళ్లు. ఆ తర్వాత బడ్జెట్‌ డిజిటల్‌ కావడం, మొబైల్‌ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌ ద్వారా ప్రతులను పంచడంతో.. కేవలం కొన్ని డాక్యుమెంట్ల ముద్రణ మాత్రమే ఉంటోంది. 

యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in, యూనియన్‌ బడ్జెట్‌ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని వార్తలు