బడ్జెట్‌ 2021: రక్షణ రంగం కేటాయింపులు..

2 Feb, 2021 08:36 IST|Sakshi

2021-22 బడ్జెట్‌: రూ. 4,78,195 కోట్లు 

202021 బడ్జెట్‌ : రూ. 4.71 లక్షల కోట్లు

మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లు

గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 19% పెంపు

గత పదిహేనేళ్లలో ఇదే అత్యధిక పెరుగుదల అన్న రక్షణ మంత్రి 

సరిహద్దు సాయుధ బలగాలకు పెరిగిన కేటాయింపు 

న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ అవసరాల దృష్ట్యా భారీ రక్షణ బడ్జెట్‌పై ఊహాగానాలు కొనసాగాయి. కానీ గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరుగుదలతో రూ.4.78 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. అయితే మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడంతో పాటు, భారత్‌–పాకిస్తాన్, భారత్‌–చైనా సరిహద్దులను రక్షిస్తున్న సాయుధ బలగాలకు కూడా ఎక్కువ కేటాయింపులే లభించాయి. మరోవైపు తూర్పు లడాఖ్‌ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మిలటరీ అవసరాల కొనుగోలు కోసం గత బడ్జెట్‌ మూలధన వ్యయం కింద రూ.20,776 కోట్లు అదనంగానే సాయుధ బలగాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ ప్రతులను పరిశీలిస్తే మాత్రం 2020–21 బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.1,13,734 కోట్లు కేటాయించగా సవరించిన మూలధన వ్యయం రూ.1,34,510 కోట్లుగా నమోదయ్యింది. చైనాతో గొడవ నేపథ్యంలో భారత సైన్యం గత కొన్ని నెలల్లో పలు దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు కొనుగోలు చేసింది.

రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు. గత ఏడాది మూలధన వ్యయం రూ.1,13,734 కోట్లతో పోల్చుకుంటే ఇది 18.75 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్‌లో రూ.1.15 లక్షల కోట్లు పెన్షన్లకు కేటాయించారు. గత ఏడాది (రూ.1.33 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2020–21లో సుమారు రూ.18 వేల కోట్ల పెన్షన్‌ బకాయిలు చెల్లించడమే ఇందుకు కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. పెన్షన్‌ను మినహాయిస్తే జీతాల చెల్లింపులు, ఆస్తుల నిర్వహణ వంటి రెవెన్యూ ఖర్చు రూ.2.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆర్మీకి మూలధన వ్యయం కింద రూ.36,481 కోట్లు, నౌకా దళానికి రూ.33,253 కోట్లు, వైమానిక దళానికి రూ.53,214 కోట్లు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసిన దానికంటే రూ.1,841 కోట్లు తక్కువ) కేటాయించారు. గత ఏడాది ఆర్మీకి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు కేటాయించారు. వైమానిక దళ గత ఏడాది మూలధన వ్యయం రూ.43,281.91 కోట్లు కాగా సవరించిన అంచనా రూ.55,055 కోట్లుగా నమోదయ్యింది. 

సాయుధ బలగాలకు అదనంగా నిధులు 
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేటాయింపు పెంచారు. బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆర్థికమంత్రి రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపు రూ.92,848.91 కోట్లతో పోల్చుకుంటే ఇది 7.1 శాతం ఎక్కువ. 

రాజ్‌నాథ్‌ కృతజ్ఞతలు 
రక్షణ బడ్జెట్‌ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కృతజ్ఞతలు తెలి పారు. మూలధన వ్యయంలో దాదాపు 19% పెరుగుదల గత 15 ఏళ్లలో అత్యధికమని పేర్కొన్నారు. కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లు తెరిచే ప్రతిపాదనపై రాజ్‌నాథ్‌ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు.  

సంతృప్తికర బడ్జెట్‌ 
కరోనా విపత్తు నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రక్షణ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి. మూలధన వ్యయం రూ.22 వేల కోట్లు పెరగడం ఆహ్వానించతగ్గ పరిణామం. సైన్యం ఆధునీకరణ కసరత్తును కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుంది.  – డాక్టర్‌ లక్ష్మణ్‌ బెహెరా, ప్రముఖ రక్షణ నిపుణుడు

మరిన్ని వార్తలు