సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం

25 Nov, 2021 04:37 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఠాకూర్‌

‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ పొడిగింపు

80 కోట్లమందికి మరో నాలుగు నెలలపాటు ఉచితంగా

ఆహార ధాన్యాలు  ఓ–స్మార్ట్‌ కార్యక్రమం ఐదేళ్లు కొనసాగింపు 

రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీ ప్రైవేట్‌పరం

కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు

సాక్షి, న్యూఢిల్లీ:  మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్‌ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమివ్వలేదు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29న ప్రారంభమై, డిసెంబర్‌ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్‌లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

80 కోట్ల మందికి లబ్ధి
పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్‌ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) కింద ఇచ్చే రేషన్‌ సరుకులకు ఇవి అదనం.
 

‘ఓ–స్మార్ట్‌’కు రూ.2,177 కోట్లు
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్‌) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్‌), సముద్ర పరిశీలక నెట్‌వర్క్‌ (ఓఓఎస్‌), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ)–చెన్నై, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌సీఓఐఎస్‌)–హైదరాబాద్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీపీవోఆర్‌)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి.

ఏసీఆర్‌ఓఎస్‌ఎస్‌ కొనసాగింపు
14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్‌ క్లైమేట్‌ రీసెర్చ్‌–మోడలింగ్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్స్, సర్వీసెస్‌ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్‌) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది.  

విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్‌  
కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌(నాట్స్‌)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్‌లకు స్టైపెండ్‌ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది.  

విద్యుత్‌ పంపిణీ ప్రైవేట్‌కు..
కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్‌ హవేలీ(డీఎన్‌హెచ్‌), డయ్యూ డామన్‌(డీడీ)లో విద్యుత్‌ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్‌లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్‌ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్‌ ఆశిస్తోంది.

మరిన్ని వార్తలు