రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు

5 Aug, 2021 02:37 IST|Sakshi
కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి ఠాకూర్‌

పునరుద్ధరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం!

త్వరలో పార్లమెంట్‌ ముందుకు బిల్లు

న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్‌ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్‌ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది.

జాతీయ బీసీ కమిషన్‌ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్‌ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్‌ 342ఏ ప్రకారం ఎస్‌ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్‌ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్‌’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే.

ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.  అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్‌ ఓకే చెప్పిందని సమాచారం.
మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం
పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అంగన్‌వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్‌ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్‌ మెషీన్ల ఏర్పాటు, సీనియర్‌ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు.

మరో రెండేళ్లు ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులు
389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది.

మరిన్ని వార్తలు