3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం

7 Feb, 2023 05:51 IST|Sakshi

అలహాబాద్, కర్నాటక, మద్రాస్‌ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్‌ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు అనడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు