‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్‌’

21 Dec, 2020 11:32 IST|Sakshi

వ్యాక్సిన్‌ వద్దనుకుంటే బలవంతం చేయం: హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో కరోనా వైరస్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేపడతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది జనవవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నాం. జనవరి నెల ఏ వారంలో అయిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావొచ్చు.

ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌ లేవల్స్‌ వారిగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 206 జిల్లాల నుంచి దాదాపు 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. అయితే వీటన్నింటి కంటే ముందు వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను దూరం చేయడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. అయితే ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడం మా బాధ్యత. కానీ ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోతే.. వారిని బలవంతం చేయం’ అని తెలిపారు. (చదవండి: 6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా)

ఇక మహమ్మారి అత్యంత చెత్త దశ ముగిసింది అని భావిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు హర్షవర్ధన్‌ సమాధానమిస్తూ.. ‘ముగిసిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు లక్షల యాక్టీవ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఇవి 10 లక్షలుగా ఉండేవి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటితే.. 95 లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచంలో మన దగ్గరే అత్యధిక‌ రికవరీ రేటు నమోదయ్యింది’ అన్నారు. అయినప్పటికి జనాలు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను పాటించడం మరవకూడదు. ఈ విషయంలో మనం ఎలాంటి సడలింపులు ఇవ్వదల్చుకోలేదు అన్నారు హర్షవర్ధన్‌. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు