Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్.. ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం

24 Jul, 2022 16:56 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది.  మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరునాడే సమావేశం జరగడం గమనార్హం. 

ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం  తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. 

ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం  ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్‌ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. 

మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది.
చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్‌

మరిన్ని వార్తలు