‘ఉగ్ర’ దేశాలపై ఆర్థిక ఆంక్షలు: అమిత్‌ షా

20 Nov, 2022 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాద మూకలకు స్వర్గధామాలుగా మారిపోయిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిందేనని కేంద్రం హోంశాఖ మత్రి అమిత్‌ షా అన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆయన శనివారం ఢిల్లీలో ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ సరిహద్దులుండవు. దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయి. వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి’’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ‘‘టెర్రరిజం రాజకీయ అంశం కాదు. పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటర్‌–టెర్రర్, ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను బలోపేతం చేసుకోవాలి’’ అని అమిత్‌ షా తెలిపారు.

మరిన్ని వార్తలు