మరిన్ని నిధులు ఇవ్వండి: సీఎం కేసీఆర్‌

27 Sep, 2021 01:53 IST|Sakshi
ఆదివారం ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి. సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఎనిమిది రాష్ట్రాల సీఎంలతో భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. వామపక్ష తీవ్రవాదుల ఆదాయ వన రులను స్తంభింపజేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రాలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి ఒక వ్యవస్థను తయారు చేసి.. ఆదాయ వనరులు అందే మార్గాలను ఆపేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ఏడాది పాటు ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, తద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, కార్య క్రమాల అమల్లో వేగం అవసరమని స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాదాన్ని దీటుగా ఎదు ర్కొనేందుకు ప్రభావిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు కనీసం మూడు నెలలకోసారి కేంద్ర సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల సీఎంలు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల సీనియర్‌ అధికారులు, కేంద్ర మంత్రులు, సాయుధ పోలీసు దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వామపక్ష తీవ్రవాద ఘటనలు తగ్గాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో వామపక్ష తీవ్రవాదంపై అనేక విజయాలు సాధించామని అమిత్‌షా పేర్కొన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాద çఘటనలు 23 శాతం తగ్గాయని, మరణాల సంఖ్య 21 శాతం తగ్గిందని తెలిపారు. కొన్ని దశాబ్దాల్లో మొదటిసారిగా ఏటా మరణాల సంఖ్య 200 కంటే తక్కువగా నమోదైందన్నారు. ఈ సమస్యను పూర్తిగా తొలగించుకుంటే తప్ప.. పూర్తి అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో అనేక తీవ్రవాద గ్రూపులు లొంగిపోయి ఆయుధాలు వదిలివేయడంలో కేంద్రం విజయవంతమైందన్నారు. ఆయుధాలను విడిచిపెట్టాలనుకొనేవారికి ప్రభుత్వాలు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాయని.. కానీ ఆయుధాలతో అమాయక ప్రజలకు, పోలీసులకు హానికలిగిస్తే అదే రీతిలో ప్రతిస్పందన లభిస్తుందని అమిత్‌షా హెచ్చరించారు.

కేంద్ర బలగాలతో సమన్వయం అవసరం
గత 40 ఏళ్లలో 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సమస్యపై చేస్తున్న పోరాటం ఇప్పుడు ముగింపునకు చేరుకుందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. దీనిని మరింత వేగవంతం చేయాల్సి ఉందని.. వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపే విషయంలో రాష్ట్ర పాలనా యంత్రాంగం చురుగ్గా ఉండాలని స్పష్టం చేశారు. ఈ దిశగా కేంద్ర బలగాల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ఊతం
వామపక్ష ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అమిత్‌షా తెలిపారు. రహదారులు, టెలికాం కనెక్టివిటీ పెంచామని చెప్పారు. ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు ఆర్ధిక చేయూత కోసం 1,789 పోస్టాఫీసులు, 1,236 బ్యాంక్‌ బ్రాంచ్‌లు, 1077 ఏటీఎంలు తెరిచామన్నారు. అక్కడి యువతకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు.

25కు తగ్గిన ప్రభావిత జిల్లాలు
తొలుత 35గా ఉన్న ప్రభావిత జిల్లాల సంఖ్యను 2018లో 30కి తగ్గించగా, ఈ ఏడాది జూలైలో 25కి కుదించగలిగామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే మావోయిస్టులు మళ్లీ పుంజుకొనే పరిస్థితులు కనిపించడంతో తొలగించిన జిల్లాల్లో ఎనిమిదింటిని ఆందోళనకర జిల్లాలుగా వర్గీకరించామని పేర్కొంది.

మరిన్ని నిధులు ఇవ్వండి..
యువత వామపక్ష తీవ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతున్నాయని ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెంను మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాగా.. ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భూపాలపల్లిలకు తక్కువ ప్రాబల్యమున్న జిల్లాలుగా కేంద్ర హోంశాఖ ఇటీవల గుర్తించిందని.. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ కోసం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల ద్వారా అక్కడి నిరుద్యోగ యువతకు ఆర్థిక తోడ్పాటు కల్పించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని వివరించారు.

కొత్త జిల్లాల లెక్కన..
ప్రభావిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం.. భద్రతా సంబంధిత వ్యయం (ఎస్‌ఆర్‌ఈ), ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన పథకం (ఎస్‌ఐఎస్‌), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ) కింద రోడ్ల నిర్మాణం, మొబైల్‌ టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, పోస్టాఫీసుల ఏర్పాటు వంటివి చేపడుతోంది. వీటితోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగాల కల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తోంది.

రాష్ట్రానికి ఎస్‌ఆర్‌ఈ కింద 2017 నుంచి 2021 వరకు రూ.42.06 కోట్ల నిధులు, ఎస్‌ఐఎస్‌ కింద రూ.13.12 కోట్లు, ఎస్‌సీఏ కింద రూ.85.92 కోట్లు అందాయి. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన అంశాన్ని ప్రస్తావిస్తూ.. వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఆయా జిల్లాల్లో యువతకు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై పలు ప్రతిపాదనలు సమర్పించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు