కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం..  కాన్వాయ్‌లోని పోలీస్‌ వాహనం బోల్తా

16 Jan, 2023 08:26 IST|Sakshi

కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్‌ చౌబే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి బక్సర్‌ నుంచి పాట్నా వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీస్‌ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. డుమ్రాన్‌లోని మథిలా-నారాయణపూర్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోల్తాకొట్టిన కారు కాలువలో పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయిదుగురు పోలీసులతో సహా డ్రైవర్‌కు గాయలవ్వగా.. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పోలీస్‌ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో వెనకాలే కేంద్రమంత్రి కారు ఉండడం గమనార్హం. అయితే ఈ ఘటనలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.  ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చెందిన ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రమాదంలో బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి తనిఖీ చేయడాన్ని చూడవచ్చు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

‘బక్సర్ నుంచి పాట్నాకు వెళ్లే క్రమంలో కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారి వంతెన కాలువలో ప్రమాదానికి గురైంది. శ్రీరాముని దయవల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌ను డుమ్రావ్ సదర్ ఆసుపత్రికిలో చేర్చారు’ అని ట్వీట్‌ చేశారు. కాగా బీజేపీ నేత  అశ్విని కుమార్‌ చౌబే ప్రస్తుతం కేంద్ర పర్యావరణం, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు. ఆహారం ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 


చదవండి: మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

మరిన్ని వార్తలు