Viral Video: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు

23 Jul, 2022 15:06 IST|Sakshi

భోపాల్‌: రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో కేంద్రమంత్రి బేరమాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రహదారి పక్కన కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే.. మూడు మొక్కజొన్న కంకులను మంచిగా కాల్చి.. నిమ్మరసం, ఉప్పు రాసి ఇవ్వమన్నారు. మంత్రి చెప్పినట్టే చేసిన ఆ యువకుడు మూడు కంకులకు రూ.45 ఇవ్వమన్నాడు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏంటి? మూడు మొక్కజొన్న కంకులకు 45  రూపాయలా? ధర చాలా ఎక్కువ కదా? అన్నారు. కంకులమ్మే వ్యక్తి మాత్రం నవ్వుతూ.. లేదు సర్ నేను సాధారణ ధరే చెప్పాను. మీరు కారులో వచ్చారు కదా అని ఎక్కువ చెప్పడం లేదంటూ బదులిచ్చాడు. ఊర్లో ఈ మొక్కజొన్న కంకులు ఉచితంగా ఇస్తారు కదా అన్న మంత్రి.. చివరికి మూడు కంకులకు రూ.45 చెల్లించారు.

 కేంద్రమంత్రి మధ్యప్రదేశ్‌లోని శివనీ నుంచి మండ్లా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ యువకుడు చాలా పేదవాడు. ఒక్క మొక్కజొన్న కంకికి రూ.15 అంటే మీకు చాలా ఎక్కువ అనిపిస్తుందా? సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కేకే విశ్రా విమర్శలు గుప్పించారు.

మరోవైపు బీజేపీ మాత్రం మంత్రిని సమర్థించుకుంది. రోడ్డుపై కారు ఆపి మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు కేంద్రమంత్రి వెళ్లారని, అతను అడిగినంత డబ్బు ఇచ్చారు కదా అని పేర్కొంది. దేశంలో నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెరిగాయని విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
చదవండి:లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు!

మరిన్ని వార్తలు