ఆ అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దే: షెకావత్‌

6 Oct, 2020 15:58 IST|Sakshi

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పూర్తిగా చర్చించాం

ఏకాభిప్రాయంతో పరిష్కారానికి వచ్చాం

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సాక్షి, న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దేనని షెకావత్‌ స్పష్టం చేశారు. (చదవండి: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం)

‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్‌ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్‌ బోర్డ్‌ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్‌ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు.

 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (రాష్ట్ర విభజన చట్టం) ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” ఏర్పడిందని, నాలుగు సంవత్సరాల అనంతరం ఈ సమావేశం జరిగిందని షెకావత్‌ అన్నారు. 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో “అపెక్స్ కౌన్సిల్” సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ కౌన్సిల్ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని షెకావత్‌ వెల్లడించారు. 

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు..
కేఆర్‌ఎంబీ,జీఆర్‌ఎంబీ బోర్డుల పరిధి నోటిఫై చేస్తున్నాం
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపడానికి అంగీకారం 
న్యాయ సలహా తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం
సుప్రీం కోర్టు నుంచి కేసు ఉపసంహరణ చేస్తే నది జలాల పంపిణీ పై ట్రిబ్యునల్ ఏర్పాటు. కేసు ఉపసంహరణకు సీఎం కేసీఆర్‌ అంగీకారం
కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం ఆంధ్రాకు తరలింపు

>
మరిన్ని వార్తలు