కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు షాక్‌.. అక్రమ నిర్మాణాలపై భారీ జరిమానా!

20 Sep, 2022 13:51 IST|Sakshi

ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు షాక్‌ ఇచ్చింది ముంబై హైకోర్టు. జుహు ప్రాంతంలోని రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముంబై అధికారులను ఆదేశించింది. ఆ నిర్మాణాలు ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ), కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జడ్‌) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్‌ ఆర్‌డీ ధనుక, జస్టిస్‌ కమల్‌ ఖాటాలతో కూడిన ధర్మాసనం. 

నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేయాలంటూ రాణా కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని ఆదేశించింది ధర్మాసనం. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేయటం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని బీఎంసీకి సూచించింది కోర్టు. ఆ తర్వాత వారం లోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. 

అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించటంతో పాటు కేంద్ర మంత్రి నారయణ్‌ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ విభాగంలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని, దాంతో సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్‌ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకు ముందు ఈ ఏడాది జూన్‌లో అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరగా బీఎంసీ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది సంస్థ.
ఇదీ చదవండి: ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ!

మరిన్ని వార్తలు