బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణ.. రాళ్ల దాడి.. కేంద్ర మంత్రి కాన్వాయ్‌ అద్ధాలు ధ్వంసం

25 Feb, 2023 17:59 IST|Sakshi

కోల్‌కతా: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై శనివారం పశ్చిమ బెంగాల్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలోనే.. ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్.. స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో  దిన్‌హటాలోని బురిర్‌హాట్‌లో టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు సిద్ధమయ్యారు. వాళ్లను బీజేపీ కార్యకర్తలు నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఈ తరుణంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

అయితే ఇది టీఎంసీ మద్దతుదారుల పనేనని ఆయన ఆరోపించారు. ఒక మంత్రికే రక్షణ కరువైనప్పడు సామాన్యుల పరిస్థితి ఏంటని.. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదని దాడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 

బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై.. మంత్రి నిసిత్‌ హోంశాఖకు సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికమీడియా కథనాలు ప్రచురిస్తోంది. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌​ బెనర్జీ సైతం తాజాగా నిసిత్‌ ప్రమాణిక్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని, ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలతో నిరసనలు చెబుతామని హెచ్చరించారు కూడా. 

మరిన్ని వార్తలు