నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్‌.. 10లక్షలు ఇవ్వకపోతే..

21 Mar, 2023 21:17 IST|Sakshi

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నితిన్‌ గడ్కరీ కార్యాలయానికి మూడుసార్లు బెదిరింపు కాల్స్‌ చేశాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు గడ్కరీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బెదిరింపు కాల్‌లో నిందితుడు.. గడ్కరీని రూ. 10కోట్లు డిమాండ్‌ చేసినట్టు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే ఆయన్ను చంపేస్తామని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, గడ్కరీ మంగళవారం సాయంత్రం నాగపూర్‌కు వస్తున్న క్రమంలో ఇలా జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

దీనిపై నాగపూర్‌ రెండో జోన్‌ డిప్యూటీ సీపీ రాహు మాడన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్‌ గడ్కరీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేశాడు. సదరు వ్యక్తి మూడుసార్లు కాల్‌ చేసి తనని తాను జయేశ్‌ పూజారిగా చెప్పుకున్నాడు. అనంతరం.. ఫోన్‌కాల్‌లో రూ. 10 కోట్లు డిమాండ్​ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆ కాల్స్​ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గడ్కరీ ఆఫీసు, ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. 

మరోవైపు.. నిందితుడు కాల్‌ చేసిన నంబర్‌ను పోలీసులు ట్రేస్‌ చేయగా మంగళూరులోని ఓ మహిళకు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్‌పై ఉత్కంఠ నెలకొంది. కాల్‌ సదరు మహిళ చేసిందా? లేక పూజారి జయేశ్‌ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు కూడా గడ్కరీకి ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అప్పుడు కూడా నిందితుడు.. ఇలాగే రూ.10కోట్లు డిమాండ్‌ చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు