కేంద్రమంత్రి అథవాలేకు కరోనా, ఆసుపత్రికి తరలింపు

27 Oct, 2020 15:06 IST|Sakshi

 నటి పాయల్ ఘోష్ , అథవాలే ఫేస్ మాస్క్ తొలగించి మరీ ప్రెస్ మీట్ 

ఆందోళనలో కార్యకర్తలు

‘గో కరోనా గో’ అంటూ గతంలో వార్తల్లో నిలిచిన అథవాలే

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మయూర్ బోర్కర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అటు అథవాలే కూడా తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా ప్రకారం తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్త తీసుకోండి, సురక్షితంగా ఉండండని పేర్కొన్నారు. (నటి పాయల్‌ ఘోష్‌ పొలిటికల్‌ ఇన్నింగ్స్‌)

మరోవైపు పాయల్ ఘోష్ పార్టీలో చేరిన సందర్భంగా  అథవాలే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాయల్ ఘోష్  పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమెను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో అథవాలే, పాయల్ ఘోష్ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పటికీ దాన్ని ముక్కుమీద నుంచి తొలగించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. వేదికపై ఉన్నవారు కూడా దాదాపు ఇలానే ఉండటం గమనార్హం. తాజాగా అథవాలే కరోనా బారిన పడటంతో సమావేశానికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది.

కాగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఫిబ్రవరి 20న ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద చైనా కాన్సుల్‌ జనరల్‌ టాంగ్ గ్యుకోయి, కొద్దిమంది బౌద్ధ సన్యాసులతో కలిసి ‘గో కరోనా గో’ అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు