రైల్వే సహాయమంత్రి సురేశ్‌ కన్నుమూత

24 Sep, 2020 07:09 IST|Sakshi

కరోనాతో మృతిచెందిన తొలి కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి (65) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. సురేశ్‌ కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు.

తిరుగులేని నేత: 1955 జూన్‌ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బెళగావిలోని ఎస్‌ఎస్‌ఎస్‌ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. సురేశ్‌ అంగడి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సురేశ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.

ఏపీ గవర్నర్‌ సంతాపం:
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి సురేశ్‌ అంగడి మృతిపట్ల ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. సురేశ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌ సంతాపం: రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ఆకస్మిక మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం నుంచి కిసాన్‌ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్‌తోపాటు పాల్గొన్న సందర్భాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వార్తలు