స్థానికం హింసాత్మకం: పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

2 Feb, 2021 16:41 IST|Sakshi

చండీగడ్‌: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా ఓ పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. దీంతో పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పంజాబ్‌లోని ఫజ్లికా జిల్లా జలాలాబాద్‌లో శిరోమణి అకాలీదల్‌ (ఎస్‌ఏడీ) అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పర్యటనకు రాగా కాంగ్రెస్‌ నాయకులు అడ్డగించారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమానికి బాదల్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తకలు అకాళీదల్‌ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు బాదల్‌ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం తీవ్రంగా దెబ్బతింది. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే బాదల్‌ను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టాయి. ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మన్‌ కూడా జలాలాబాద్‌ పర్యటన ఉండడంతో నిమిష నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ చౌరస్తాలో బాదల్‌ తన అనుచరులతో ధర్నా చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే అకాలీదళ్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పి కొట్టింది. ఈ ఘటనకు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ బాధ్యత వహించాలని ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు