పరిమితిని తొలగిస్తేనే మరాఠా రిజర్వేషన్లు

9 Aug, 2021 04:39 IST|Sakshi

శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌

ముంబై: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తప్ప మరాఠా కోటా రిజర్వేషన్లను అమలు చేయలేమని శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరాఠా కోటా గురించే తాను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించానన్నారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్‌ చవాన్‌ అఖిలపక్ష నాయకులతో వర్చువల్‌గా భేటీ అవుతారని వెల్లడించారు.

రాష్ట్రాలు ఓబీసీ జాబితా రూపొందించుకునేలా అధికారం కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చకు పట్టుబడతానని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల పొత్తు గురించి మాట్లాడేందుకు సంజయ్‌ రావుత్‌ నిరాకరించారు. డిసెంబర్‌ 28వ తేదీన రాహుల్‌ గాంధీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిసెంబర్‌ నెల ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు