బిహార్‌, ఎంపీ, యూపీలలో అమల్లోకి రాత్రి కర్ఫ్యూ

8 Jun, 2021 15:21 IST|Sakshi

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పలు రాష్ట్రాల్లో ఎత్తి వేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయలో లాక్‌డౌన్‌ విధిస్తూనే భారీగా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు 50 శాతం మందితో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి.

ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం పగటిపూట కర్ఫ్యూ కొనసాగింది. తాజాగా పగటిపూట కర్ఫ్యూను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాల మేరకు ఎత్తివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో దశ ముప్పు రాదని స్పష్టం చేశాయి.

చదవండి: లాక్‌డౌన్‌ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు

మరిన్ని వార్తలు