Unnao Case: నిందితుడికి బెయిల్‌ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ

18 Jan, 2023 18:17 IST|Sakshi

ఉన్నావ్‌ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు మధ్యంతర బెయిల్‌ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు.

అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్‌ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం.

మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది.  తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కి ఉన్నావ్‌ 2017 అ‍త్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్‌ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్‌ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్‌తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

(చదవండి: కాంగ్రెస్‌ తొలి జాబితా .. ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌)
 

మరిన్ని వార్తలు