పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్‌ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?

17 Jul, 2022 07:38 IST|Sakshi

నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్‌ మనోహర్‌ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్‌ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. 

తమ పూర్వీకులను అంతమాట అన్నా.. ‘నేను సాధారణ ప్రజల మనిషిని అని ఇన్నాళ్లుగా చెప్తునే ఉన్నాను. ఇప్పటికైనా గౌరవనీయ సభ్యుడు ఈ విషయాన్ని అంగీకరించారు’ అన్నారు నెహ్రూ నవ్వుతూ..

అది 1962.. చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది.. ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. 
‘అది చాలా చిన్న భాగం అక్కడ గడ్డి కూడా మొలవదు. వ్యర్థ భాగమే’.. ఆ నిరసనకు అప్పటి ప్రధాని నెహ్రూ సమాధానం. 

‘మరి నా తలపై కూడా ఏమీ మొలవట్లేదు. అది కూడా వ్యర్థమేనా?’.. స్వపక్షమే అయినప్పటికీ కాంగ్రెస్‌ ఎంపీ  మహవీర్‌ త్యాగి చురక .. నెహ్రూ సహా అంతా ఘొల్లుమని నవ్వారు.. 

ఇక కొద్దికాలం క్రితం రాజ్యసభలో చర్చ.. ‘విదేశాలన్నా, వారి తెల్ల తోలు అన్నా భారతీయులకు మోజెక్కువ. తెల్లని వధువే కావాలనుకుంటారు..’ అంటూ వెటకారంతో దక్షిణాది మహిళల శరీరం, వారి ఛాయపైనా రాజ్యసభలో కామెంట్లు..  నిజానికి ఇక్కడ చర్చ అంశం ‘బీమాలోకి విదేశీ పెట్టుబడులు...’. కానీ కామెంట్స్‌ చేసినది స్త్రీలు, వారి శరీరాలపై.. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ఓ బిహార్‌ ఎంపీ తీరు ఇది.. ఈ వ్యాఖ్యలపై మహిళా సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తన ‘మాట’ను వెనక్కి తీసుకోవడానికి ఆయన మొరాయించారు. 
..ఇదీ ఇప్పటి పెద్దల సభలో మర్యాద. 

ఇక ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాల (అమర్యాద నుంచి అసభ్యందాకా అర్థం రూపాంతరం చెందింది) గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. లోక్‌సభ ‘అన్‌పార్లమెంటరీ’ పుస్తకంలో కొత్తగా ‘కోవిడ్‌ వ్యాప్తి కారకుడు, సిగ్గుచేటు, వంచకుడు, అవినీతి పరుడు, అసమర్థుడు, కపటబుద్ధి’లాంటివి చేర్చారు. ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన జుమ్లా అనే పదాన్ని (మన స్థానిక నేతల నోటి నుంచి తరచూ వింటున్నాం) కూడా నిషేధించారు. 

‘మేం కొత్తగా చేర్చిందేమీ లేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో వద్దనుకుని తొలగించిన పదాలనే ఇప్పుడు మేమూ అన్‌పార్లమెంటరీ పదాల్లో చేర్చాం. 1954 నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది..’అని లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా చెబుతున్నారు.. అన్నీ మాట్లాడుకోవచ్చు, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డేమీ ఉండదని అంటున్నారు. 
అమర్యాద.. బాగా పెరిగింది..! 

1954 నుంచి చేర్చుతూ పోతూంటే అన్‌పార్లమెంటరీ పదాలు, నిబంధనలు గట్రా కలిసి ఇప్పటికి ఏకంగా 900 పేజీల పుస్తకంగా తయారైంది. ఈ కరదీపిక మన రాజకీయ ఔన్నత్యానికి సూచికలాంటిది. పదునైన మాటలు, భావాలతో కూడిన ఈ పట్టిక రాజకీయ నేతల హుందాతనానికి ప్రతీక అనుకుందాం. కొంచెం అటు ఇటుగా అసెంబ్లీలు, శాసన మండళ్లకూ ఇవి వర్తిస్తాయి. 

‘పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు. పొలిటికల్‌ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?’’.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న జోక్‌. మన నేతలు మాటలతో సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్‌ ఇదీ.. 

‘పెద్ద మగాడివా.. నోర్మూస్కో.. చెయ్యి తీస్తా.. నీయవ్వ.. గాజులు వేసుకోలే.. నాలుక కోస్తా..’.. ఇవన్నీ వీధి చివర గలాటాలోనో, రచ్చబండ దగ్గర గొడవలోనో వినిపిస్తున్నవి కాదు. అచ్చంగా మనం ఓట్లేసి.. ‘మా బతుకులు మార్చండి. మీరు చర్చలు చేసుకుని, మాట్లాడుకుని మా భవిష్యత్తు తీర్చిదిద్దండి’అంటూ చట్టసభలకు పంపిన గౌరవనీయ ప్రజాప్రతినిధులే చర్చలను ఇలాంటి మాటలతో రచ్చ చేస్తున్నారు.

చదవండి: అన్‌పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. విపక్షాల సెటైర్లు

అవినీతీ.. అమర్యాదే..
సమాజంపై వీటి ప్రభావం వంటి విషయాలు వదిలేసి ‘పొలిటికల్‌’గా చూస్తే.. ఈ అమర్యాద, అసభ్య (అన్‌పార్లమెంటరీ) పదాల లిస్టులు ఎందుకు పెరుగుతాయి? ‘పాలక పక్షం’అవసరం కోసమే కదా! లేటెస్ట్‌ లిస్టు చూడండి. ‘అవినీతిపరుడు.. అసమర్థుడు.. కపట బుద్ధి.. నియంత.. సిగ్గుచేటు’ఇలాంటి పదాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ‘‘ఈ పదాలు లేకుండా విపక్షాలు ఏం మాట్లాడుతాయి? ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పనులే ఇవి కదా! వీటి గురించి మాట్లాడకుండా నోరు మూస్తే ఎలా?’’ అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ‘జై మోదీ’ తప్ప అన్నీ అన్‌పార్లమెంటరీ పదాలేనా అని విమర్శిస్తున్నాయి. ‘మీ అసమర్థతను, అవినీతిని, అబద్ధాలను ప్రజలకు చెప్పొద్దా? మేం అనొద్దా’అంటూ గగ్గోలు పెడుతున్నాయి. 
ఇలా వేటినైతే నిషేధిస్తూ వెళుతున్నారో.. అవే పదాలు పాలక, ప్రతిపక్ష రాజకీయాలకు పర్యాయపదాలు కావడం ‘అమృతోత్సవ భారతా’నికి గొంతులో గరళమే.. మరి పాలక పక్షాలు ఇలా తమకు అనువైన పదాల ‘లిస్టు’ను నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడే జరిగిందా..? 

2012లో యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అప్పట్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తరచూ మాట్లాడే ‘అలీబాబా 40 దొంగలు, బద్మాష్, బ్లాక్‌మెయిల్‌..’వంటి పదాలను అన్‌ పార్లమెంటరీ లిస్టులో పెట్టింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మర్యాద పూర్వకంగా అమర్యాదకర లిస్టులు మారుతాయన్నమాట. 

మాటలు బుక్కుల్లోకి చేరుతున్నాయి.. కానీ బయటికి రాకుండా ఆగుతున్నాయా? అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది. పార్లమెంటులో మాటలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు. కానీ లోక్‌సభలో స్పీకర్, పెద్దల సభ చైర్మన్‌ వాటిని కంట్రోల్‌ చేయవచ్చు. మాటలను వెనక్కి తీసుకోవాలని సభ్యులను ఆదేశించవచ్చు. తాత్కాలికంగా సస్పెండ్‌ చేయవచ్చు. రికార్డుల్లోంచి తొలగించవచ్చు. కానీ ఈ మాట చూడండి.. 

‘మీరు నిషేధించిన మాటలే వాడుతాను. కావాలంటే నన్ను సస్పెండ్‌ చేసుకోండి..’ అని టీఎంసీ నేత ఓబ్రియాన్‌ అంటున్నారు. ‘తగ్గేదేలే’అనే మన రాజకీయ వ్యవస్థకు, మనం పైన వేసుకున్న ప్రశ్నకు చక్కని సమాధానం ఇది. అయితే.. అసాధారణంగా స్వయంగా ప్రధాని మోదీ మాటలనే రాజ్యసభలో రికార్డుల నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి.  

సభ్యులు మాట్లాడే మాటలను పార్లమెంట్‌ సిబ్బంది రాసుకుని, అందులో అభ్యంతరకరమైన మాటలను స్పీకర్‌కు ఇవ్వడం, స్పీకర్‌ వాటిని రికార్డుల నుంచి తొలగించడం ఒకప్పుడయితే ఓకే.. ఇప్పుడంతా లైవ్‌.. రికార్డుల నుంచి తొలగించేలోపే జనంలో ఆ మాటలన్నీ రికార్డయిపోతాయి. 
అందుకే సామాజిక మాధ్యమాల్లో ఓ కుర్రాడి మాట.. ‘సభల్లో ఫైట్లే లైవ్‌లో చూస్తున్నాం.. ఇక తిట్లెందుకు కంట్రోల్‌ చెయ్యడం. సరదాగా ఉంటుందని కానీయండి..’అని.. 

చదవండి: ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్‌

ఇది బాగుంది
‘ఖలిస్తానీ, చెంచా, చెంచాగిరీ, పిరికివాడు, క్రిమినల్, గాడిద, అహంకారి..’సభలో ఇలాంటివి మరొక వ్యక్తిని అనకూడదు. ఎవరిని వారే అనుకుంటే తప్పులేదట.. ఓ వెసులుబాటు 

ఇది బాగుంటుంది
అధ్యక్షా.. మీ సభల్లోనే కాదు. మా వీధుల్లో కూడా.. ‘బట్టేబాజ్, బచ్చా, సన్నాసి, బేవకూఫ్, సాలే, గూట్లే, లఫంగి’వంటి పదాలు మారుమోగుతున్నాయి. ఇవి ఆపడానికి నిబంధనలు పెట్టండి.. మరిన్ని కరదీపికలు వేయండి.. ఓ విన్నపం

మాటలకు ‘కట్టడి’ఉంది! 
రాజ్యాంగంలోని 105 (2) ఆర్టికల్‌ ప్రకారం.. ‘పార్లమెంటు సభ్యులు సభల్లో మాట్లాడే అంశాలపై ఏ కోర్టులో, ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదు’.. అంటే పార్లమెంటులో సభ్యులు మాట్లాడే మాటలకు రాజ్యాంగ రక్షణ ఉంది. కానీ చట్టసభల నిర్వహణ నిబంధనలు ఆయా సభల్లో సభ్యులు ‘సరిగా’ ప్రవర్తించేలా, ‘సరిగా’ మాట్లాడేలా చూసుకునే బాధ్యతను, అధికారాన్ని లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో చైర్మన్‌కు దఖలుపర్చాయి. లోక్‌సభ నియమావళిలోని రూల్‌ 380, 381 ప్రకారం.. ‘సభలో జరిగే చర్చల్లో ఏవైనా మాటలు ఎవరినైనా అగౌరవపర్చేలా, అసభ్యంగా ఉంటే.. స్పీకర్‌ ఆ పదాలను సభ రికార్డుల నుంచి తొలగించవచ్చు’. 

400 ఏళ్ల నాటి నుంచే ‘అన్‌ పార్లమెంటరీ’ గొడవ
చట్ట, ప్రజాప్రతినిధుల సభల్లో ‘అన్‌ పార్లమెంటరీ’పదాల గొడవ ఈనాటిదేమీ కాదు. బ్రిటిష్‌ చరిత్రకారుడు పాల్‌ సీవార్డ్‌ రాసిన వివరాల ప్రకారం.. 1604వ సంవత్సరంలోనే సభ్యుల మాటలను తొలగించే ‘పని’ మొదలైంది. నాటి బ్రిటిష్‌ సభలో అంతకుముందు రోజు జరిగిన చర్చలో లారెన్స్‌ హైడ్‌ అనే న్యాయవాది వాడిన ‘అభ్యంతరకర’మాటలపై.. మరునాడు చర్చించి రికార్డుల నుంచి తొలగించారు. అప్పుడే ‘సభలో చర్చ జరిగే విషయాన్ని వదిలేసి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడకుండా స్పీకర్‌ నియంత్రించాలి’అని నిబంధననూ పెట్టుకున్నారు. 

ఆస్ట్రేలియాలో ప్రతినిధుల సభలో ‘అబద్ధాలకోరు (లైయర్‌), మూగ (డంబో)’పదాలను ‘అన్‌ పార్లమెంటరీ’గా ప్రకటించుకుంది. ‘చిన్నపిల్లల్లా వ్యవహరించడం (చైల్డిష్‌నెస్‌)’అనే పదాన్నీ నిషేధించుకుంది. న్యూజిలాండ్‌ చట్టసభల్లో ‘కమ్మో (కమ్యూనిస్టు అనే పదానికి షార్ట్‌కట్‌)’పదాన్ని అనుమతించరు. కెనడాలో అయితే మరో అడుగు ముందుకేసి.. ‘దుష్ట మేధావి (ఈవిల్‌ జీనియస్‌), కెనడియన్‌ ముస్సోలిని (ముస్సోలిని అనేది ఒకప్పటి ఇటలీ నియంత పేరు), జబ్బుపడ్డ జంతువు (సిక్‌ యానిమల్‌)’వంటి పదాలూ నిషేధిత జాబితాలో పెట్టుకున్నారు. 

ఇవేకాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల చట్టసభల్లో పాలకవర్గాలు ‘అన్‌ పార్లమెంటరీ’మాటలను లిస్టుల్లో పెట్టేసుకుంటూనే ఉన్నాయి. నోటికి బట్టకట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
-సరికొండ చలపతి

చదవండి: సభా విలువలు కాపాడాలి

మరిన్ని వార్తలు