ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి

22 Jan, 2021 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి ముఖ్య గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రాబోయే కొద్ది రోజులు పాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్ చేయకండి అని యుపీఐ యూజర్లను కోరింది. అయితే అది ఎన్ని రోజులు అనేది ఎన్‌పిసిఐ పేర్కొనలేదు. కేవలం “రాబోయే కొద్ది రోజులు” అని మాత్రమే పేర్కొన్నారు.  వినియోగదారులు ఎన్‌పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా తెలిపింది.(చదవండి: 'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్‌పే)

ఆన్లైన్ లావాదేవీల కోసం చాలా మంది వినియోగదారులు యుపీఐ యాప్ ల మీద ఆధారపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం భీమ్ యుపీఐ ప్లాట్‌ఫామ్‌లో 165 బ్యాంకులు లింక్ అయ్యి ఉన్నాయి. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు భారీ మొత్తంలో జరిగాయి. అంతేకాకుండా ఈ యుపీఐ యాప్ లో డిస్కౌంట్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వినియోగదారులను వీటికి ఆకర్షితులు అవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్‌లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు ఎన్‌పిసిఐ పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు