Uttarakhand Dalit Cook: ‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు

24 Dec, 2021 06:03 IST|Sakshi

తినడానికి అగ్రవర్ణ పిల్లల నిరాకరణ

ఆమెను తొలగించిన అధికారులు

ఉత్తరాఖండ్‌ పాఠశాలలో దారుణం

డెహ్రడూన్‌: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో  మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్‌ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్‌ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్‌ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు.
(చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం)

మరిన్ని వార్తలు