స్మార్ట్‌ఫోన్‌తో ప్రిపరేషన్‌.. తొలి ప్రయత్నంలోనే విజయం!

1 Jun, 2022 10:19 IST|Sakshi

రాంఘర్‌(రాంచి): పేద కుటుంబం..కోచింగ్‌ తీసుకునే స్తోమత లేదు..అయినప్పటికీ వెనుకాడలేదు. రోజుకు 18 గంటలపాటు చదువుకుని, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకుని యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేరైంది. రెండు రోజుల క్రితం వెలువడిన యూపీఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో ఆల్‌ ఇండియా 323వ ర్యాంక్‌ సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దివ్యా పాండే(24) ఘనత ఇది. రాంచీ యూనివర్సిటీ నుంచి దివ్య 2017లో డిగ్రీ పొందారు.

ఈమె తండ్రి జగదీష్‌ ప్రసాద్‌ పాండే సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేసి 2016లో రిటైరయ్యారు. ‘ఇంటర్నెట్‌ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్‌ సివిల్స్‌ సాధించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్‌లోని అపార సమాచారాన్ని వాడుకున్నా. రోజుకు 18  గంటలపాటు సొంతంగా చదువుకున్నా. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

యూపీఎస్‌సీ కోసం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. ఏడాది కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం దక్కింది’ అని దివ్యా పాండే తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తానన్నారు. కుమార్తె సాధించిన ఘనతతో జగదీష్‌ ప్రసాద్‌ ఆనందానికి అవధుల్లేవు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. దివ్య ఎంతో కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు. దివ్య  చెల్లెలు ప్రియదర్శిని పాండే కూడా జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రిలిమినరీలో ఉత్తీర్ణురాలైంది.

మరిన్ని వార్తలు