కోవిడ్‌ ముప్పు: అత్యవసర చర్యలపై లాన్సెట్‌ కీలక హెచ్చరిక

18 Jun, 2021 13:27 IST|Sakshi

రానున్న వారాల్లో మళ్లీ పెరగనున్న కేసులు: లాన్సెట్‌

అత్యవసరం తీసుకోవాల్సిన చర్యలపై లాన్సెట్‌ హెచ్చరిక

8 ప్రధాన సూచనలను చేసిన 21 మంది లాన్సెట్‌  నిపుణులు

సాక్షి, న్యూఢిల్లీ: ఇపుడిపుడే కరోనా సెకండ్‌వేవ్‌నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్‌వేవ్‌  పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెడికల్  జర్నల్‌ లాన్సెట్‌ భారత ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ హెచ్చరించింది.  రానున్న  కోవిడ్‌-19 ముప్పుపై అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా  హెచ్చరికలు జారీ చేసింది.ఆరోగ్య సేవలు,  కీలక ఔషధాలపై పాదర్శకత, జాతీయంగా  ఒకే ధరల విధానం ఉండాలని  లాన్సెట్‌లో 21 మంది నిపుణులు సూచించారు. కరోనావైరస్ ఉధృతి తగ్గుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ షురూ అయిన తరుణంలో ది లాన్సెట్ వెబ్‌సైట్‌ 8 రకాల సూచనలను చేసింది.  బయోకాన్ కిరణ్ మజుందార్ షా, టాప్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టితో కూడిన 21 మంది  ఈ  చర్యలను సిఫారసు చేశారు.

లాన్సెట్‌ సూచనలు
1. అవసరమైన ఆరోగ్య సేవలను వికేంద్రీకరించబడాలి. కేసుల సంఖ్య,  అందుతున్న సేవలు  జిల్లా నుండి జిల్లాకు చాలా తేడాలున్న నేపథ్యంలో అన్ని  ప్రాంతాల్లో ఒకే విధానం ఆమోద యోగ్యం కాదు.

2. అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు , ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక,  జాతీయ ధర విధానం, ధరలపై  నియంత్రణ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా ప్రజలందరికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయాలి. 

3. కోవిడ్‌ కేసులు, నిర్వహణపై వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. పూర్తి స్పష్టతతో, ఆధారాల తో అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్‌పై అవగాహన, చికిత్స ఇతర  సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. ఈ సమాచారం స్థానిక పరిస్థితులు, క్లినికల్ ప్రాక్టీస్‌లు ఉన్న స్థానిక భాషల్లోఉండాలి.  హోం ఐసోలేషన్‌, చికిత్స, ప్రాధమిక సంరక్షణపై  జిల్లా ఆసుపత్రుల్లో  తగిన విధానాలుండాలి.

4. ఆరోగ్యం రంగానికి  సంబంధించి ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాలలో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను  కరోనా సంక్షోభ సమయంలో వినియోగించుకోవాలి.  ప్రత్యేకించి తగినంత వ్యక్తిగత రక్షణ పరికరాలు, క్లినికల్ ఇంటర్‌వెన్షన్స్‌ బీమా, మానసిక ఆరోగ్య మద్దతు వాడకంపై మార్గదర్శకత్వాలను అనుసరించాలి.

5. ప్రాధాన్యత సమూహాలకు  టీకా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి.  అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మోతాదుల వినియోగానికి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని మార్కెట్‌ యంత్రాగాలకు ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రజా ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరించాలి.

6. ప్రజల భాగస్వామ్యం, చొరవే  కోవిడ్‌ నియంత్రణకు కీలకం.  కరోనా నియంత్రణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యంతో ముంబై బాగా పనిచేసింది. ముంబైలో ముఖ్యంగా గ్రామీణ పౌర సమాజం చారిత్రాత్మక పాత్ర పోషించింది. (కరోనా సంక్షోభం: గూగుల్‌ మరోసారి భారీ సాయం)

7. ప్రభుత్వ డేటా సేకరణ, మోడలింగ్‌లో పారదర్శకంగా ఉంటూ  రానున్న వారాల్లో  కేసుల ఉధృతికి ఆయా జిల్లాలను ముందస్తుగా సిద్ధం చేయాలి. ఆరోగ్య సంరక్షణ విధానాలను బలోపేతం చేయడం,  బాధితుల వయసు, జండర్‌ ఆసుపత్రిలో చేరిక,  మరణాల రేట్లు, కమ్యూనిటీ-స్థాయిలో టీకాలు,  చికిత్స ప్రోటోకాల్స్, దీర్ఘకాలిక ఫలితాలపై కమ్యూనిటీ-ఆధారిత ట్రాకింగ్ అవసరం. (Vaccine: గేమ్‌ ఛేంజర్‌, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!)

8. అలాగే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి, అట్టడుగువర్గాల వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేస్తున్నట్లుగా నగదు బదిలీ ద్వారా  ఆర్థిక మద్దతునందించాలి. తద్వారా ఆయా కుటుంబాల్లో  జీవనోపాధి కోల్పోవడం వల్ల కలిగే తీవ్ర బాధలు, అనారోగ్య ముప్పును తగ్గించాలి. సంఘటిత రంగంలోని సంస్థలు కార్మికులందరినీ పనిలో కొనసాగించేలా చూడాలి. ఆర్థిక రంగం తిరిగి పుంజుకున్న తరువాత ఈ సంస్థలకు పరిహారం అందించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. తద్వారా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా ఆయా కంపెనీల యజమానులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించేలా చూడాలి.

చదవండి: టాప్‌-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్‌

మరిన్ని వార్తలు