విమానంలో మూత్ర విసర్జన: వివాదం సెటిల్‌ అవ్వడంతో ఫిర్యాదు చేయలేదు

6 Jan, 2023 13:27 IST|Sakshi

ఎయిర్‌ ఇండియాలోని బిజినెస్‌ క్లాస్‌లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్‌ చైర్మన్‌కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఎయిర్‌ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్‌నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌ ఇండియా వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉండగా...నవంబర్‌ 27ను న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్‌ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్‌ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్‌పోర్ట్‌లో ఎలర్ట్‌ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది.

అంతేగాదు ఎఫ్‌ఐఆర్‌లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది.

అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్‌ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. 

(చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!)

మరిన్ని వార్తలు