మన ‘తేజస్‌’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి

6 Aug, 2022 04:30 IST|Sakshi

న్యూఢిల్లీ:  హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్‌ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్‌ మలేషియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్‌ఏఎల్‌ స్వీకరించిందని అన్నారు. ట్విన్‌–సీటర్‌ వేరియంట్‌ తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు.

కాలంచెల్లిన రష్యన్‌ మిగ్‌–29 ఫైటర్‌ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్‌ భట్‌ సమాధానమిచ్చారు. స్టీల్త్‌ ఫైటర్‌ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్‌ ఫ్లైయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌’ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్‌ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

మరిన్ని వార్తలు