భారత్‌లో అమెరికా రక్షణ మంత్రి పర్యటన

20 Mar, 2021 06:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో జో బైడెన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ జే ఆస్టిన్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటనకు వచ్చారు. మూడురోజుల ఈ పర్యటనలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేసుకోవడం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం సహా పలు అంశాలపై చర్చించనున్నారు.  యూఎస్‌ నుంచి 30 మల్టీమిషన్‌ ఆర్మ్‌డ్‌ ప్రెడేటర్‌ డ్రోన్స్‌ను కొనుగోలు చేసే 300 కోట్ల డాలర్ల డీల్‌ తాజా పర్యటనలో తుదిదశకు చేరవచ్చని భావిస్తున్నారు. 

బోయింగ్, లాక్‌హీడ్‌ నుంచి 1800 కోట్ల విలువైన 114 ఫైటర్‌ జెట్లను కొనుగోలుపై కూడా చర్చలు జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  రష్యానుంచి భారత్‌ కొనుగోలు చేయదలిచిన ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థపై చర్చిస్తారని భావిస్తున్నారు.  అమెరికా  ఈ ఒప్పందం విషయంలో మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి ఆస్టిన్‌ ప్రధాని మోదీని శుక్రవారం కలిశారు. అనంతరం మాట్లాడుతూ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీతో రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చించామన్నారు.

మరిన్ని వార్తలు