దరఖాస్తుదారులంతా ఓపిక పట్టాలి.. వీసాల జారీపై దృష్టి పెట్టాం: అమెరికా

3 Dec, 2022 06:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం భారత్‌లో విపరీతమైన డిమాండే సుదీర్ఘమైన వెయిటింగ్‌ పీరియడ్‌కు కారణమని యూఎస్‌ చార్జ్‌ డి అఫైర్స్‌ రాయబారి ఎలిజబెత్‌ జోన్స్‌ అన్నారు. ‘‘దీన్ని వీలైనంతగా తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది’’ అని శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు. ‘‘భారీగా కౌన్సెలర్లను నియమించుకుంటున్నాం.

వారందరికీ వాషింగ్టన్లో యుద్ధ ప్రాతిపదికన శిక్షణ నడుస్తోంది. వారిలో వీలైనంత మందిని భారత్‌కు రప్పించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వచ్చే వేసవికల్లా ఢిల్లీ, ఇతర కాన్సులేట్లలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులోకి వస్తారు’’ అని చెప్పారు. దరఖాస్తుదారులంతా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వీసాకు తొలిసారిగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఇంటర్వ్యూల కోసం ఏకంగా మూడేళ్ల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది!

మరిన్ని వార్తలు