వీసాలకు యూ‘ఎస్‌’.. రికార్డు సృష్టించిన భారత్‌

9 Sep, 2022 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్‌ మిషన్‌ ఇన్‌ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది.

‘‘కోవిడ్‌–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్‌ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్‌ డి అఫైర్స్‌ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్‌ కౌన్సిలర్‌ డాన్‌ హెల్ఫిన్‌ అన్నారు. 

ఇరవై శాతం మంది భారతీయులే..
అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్‌ డోర్స్‌ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్‌ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్‌ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి.

ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక..

మరిన్ని వార్తలు